త్యాగరాజ స్వామి ఆరాధన

​తంజావూరు దగ్గరి తిరువయ్యార్ అనే ఊరు వాగ్గేయకార త్రయం అని పిలువబడే శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వాములను ఒకే సమయం లో మోసిన తల్లి వంటి క్షేత్రం. వీరు ముగ్గురు ద్రవిడ దేశంలో నివసించిన తెలుగు వారు కావడం మన తెలుగు వారి అదృష్టం. మొదటి ఇద్దరు ప్రధానంగా సంస్కృతం లో కృతిరచన చేసినప్పటికీ మన త్యాగరాజుల వారు తెలుగునే ఎంచుకోవడం తెలుగు వారి పరమ సౌభాగ్యం. త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు నేటికి తిరువయ్యారు లో బ్రహ్మోత్సవం లాగా జరుపుకుంటారు. ప్రపంచం నలు మూలల నుండి నాదోపాసకులు అక్కడ చేరి ఆరాధన లో భాగంగా త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులను ముక్త కంఠం తో పాడి బ్రహ్మాత్మైక్య స్థితిని పొంది తరిస్తారు. సంగీత ప్రియులు రసాస్వాదనను పొందుతారు. మన అన్నమాచార్యుల వారికంటే త్యాగరాజుల వారు కొన్ని శతాబ్దాల తరువాతి వారు కావడం వల్ల అయన నెలకొల్పిన సంప్రదాయం నేటికి ద్రవిడ దేశం లో అలాగే పదిలంగా కొనసాగుతోంది. భాషకు అతీతంగా వారు చూపే నిబద్ధత మన తెలుగు వారిలో ఇంకా కాస్త పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది.
‘సంగీత జ్ఞానము, భక్తి వినా సన్మార్గము కలదే’ అని తెలిసిన త్యాగరాజులు ఆ మార్గాన్నే పట్టుకుని శ్రీరాముని నిజ ‘బంటు రీతి కొలువు’ను పొంది ‘రామ భక్తి సామ్రాజ్యా’నికి సామ్రాట్టు అయ్యారు. రామ నామమనే వర ఖడ్గాన్ని ధరించారు.
తెలుగు ములకనాడు బ్రాహ్మణ కుటుంబంలో రామ బ్రహ్మం గారి కుమారునిగా జన్మించి తిరువయ్యారు క్షేత్రంలో త్యాగరాజు పేర కొలువున్న శివుని నామాన్ని పుచ్చుకున్నారు. సహస్రనామ తత్తుల్యం రామ నామమని చెప్పిన శివుడే కొడుకుగా వచ్చాడని బహుశ రామబ్రహ్మం గారికి స్ఫురణ కలిగిందేమో! చిన్నతనం లోనే ఆయన సంగీతం పట్ల చూపిన శ్రద్ధ ఆయన్ని శుంఠి వెంకటరమణ భాగవతుల వద్ద శిష్యుణ్ణి చేసింది. ఎన్నో కృతి రచనలు, ప్రహ్లాద భక్తి విజయం వంటి గేయ నాటకాలు వ్రాసారు. భాగవతోత్తముల వెన్నంటి ఉండే పరమ భాగవతోత్తములైన నారదులవారు వృద్ధ బ్రాహ్మణ రూపం లో వచ్చి ఆయనకు స్వరార్ణవం అనే గ్రంథాన్ని ఇచ్చారు. 
రాజులిచ్చిన మాన్యాలు ధన ధాన్యాదులు ‘నిధి చాల సుఖామా’ అని ప్రశ్నించి వద్దనుకున్నా, రాముని దయతో లోటు లేకుండా నిత్య సంతర్పణలు చేసుకునే అయన వైభవాన్ని చూసి ఈర్ష్యాపరులు ఆయన నిత్యం అర్చించే రాములవారి విగ్రహాన్ని నదిలో పారేశారు. దానితో ఆర్తి పొందిన త్యాగయ్య పుణ్య క్షేత్రాలు తిరిగి అనేక కీర్తనలు చేశారు. అప్పటికీ శాంతి చెందక ఉన్న ఆయన ఆర్తి చూసి “అంతర్ముఖుడవు కారా నాయనా, రామదర్శనం అవుతుంది” అని నారదులు చేసిన ఉపదేశంతో తొంభై ఆరు కోట్ల రామ నామ జపం మొదలు పెట్టారు! ఆ మహాసాధన క్రమం లో ఆయనకు కలిగిన దర్శనాలే పంచరత్న కృతులు అని పెద్దలు చెప్తారు. ‘జగదానంద కారకా…’ అంటూ రాముణ్ణి నుతించి, (చెంత రాకనే) ‘సాధించెనే ఓ మనసా…’ అని నిందా స్తుతి చేసి, ‘దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా…’ అంటూ భగవద్విరాహాన్ని వ్యక్తం చేసి ‘కనకన రుచిరా…’ అంటూ ఆయన్ని భావన చేసి రూప లావణ్యాన్ని వర్ణించి,  చివరికి సకల భాగవతోత్తములతో కూడిన పరివార సమేతుడైన పట్టాభి రాముణ్ణి అంతరంగం లో చూసి ‘ఎందరో మహానుభావులు…’ అన్న కీర్తన చేయడంతో ఆయన తపస్సు తురీయ స్థితి చేరింది. 
అటువంటి పంచరత్నాలని పాడుకుని లేదా విని త్యాగయ్యని స్మరించుకోవడం ఎంతో గొప్ప పూర్వ పుణ్యం ఉంటే తప్ప సాధ్య పడదు.