బ్రోవ భారమా రఘు రామ

బ్రోవ భారమా రఘు రామ

భువనమెల్ల నీవై నన్నొకని…బ్రోవ భారమా


శ్రీ వాసు దేవ అండ కోట్ల

కుక్షినియుంచుకో లేదా నన్ను…బ్రోవ భారమా


కలశాంబుధిలో దయతో-

నమరులకైయది గాక

గోపికలకై కొండలెత్త లేదా

కరుణాకర త్యాగరాజుని…బ్రోవ భారమా

ఓ త్యాగరాజార్చిత శ్రీరామ నన్ను బ్రోవ భారమా!ఓ రఘు వంశానికి ఆరామమైన రామా కాపాడు. 

ఓ వాసుదేవా నీ తల్లికి నీ కడుపులో సమస్త   జగత్తును చూపినవాడవు, సమస్త జగత్తు నీ యందే వుంది మరి ఆ జగత్తు లో పరమాణువుని నన్ను కాపాడలేవా. 

అలనాడు వ్రజమునందు గోపాల జనులకై గోవర్ధనగిరిని నీ చిటికిన వేలితో ఎత్తలేదా అంతటి సమర్థథ కలిగిన నీకీ నేనూ భారమైతానా కాపాడు. 

క్షీరసాగరమథనంలో ఉద్భవించిన అమృత కలశాన్ని నీవు అపర మోహినీ అవతారం దాల్చి కేవలం అమరులకు అమృతపాన యోగం ఇచ్చావు మరి నే భారమైపోతానా, కాపాడు.

Advertisements

నాద తనుమనిశం శంకరం

నాద తనుమనిశం శంకరం

నమామి మే మనసా శిరసా


మోదకర నిగమోత్తమ సామ

వేద సారం వారం వారం… నాద తనుమనిశం


సద్యోజాతాది పంచ వక్త్రజ

స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర

విద్యా లోలం విదళిత కాలం

విమల హృదయ త్యాగరాజ పాలం… నాద తనుమనిశం


ఓ కల్మషం లేని హృదయము కల త్యాగరాజు ను పాలిస్తున్న ఓ త్యాగరాజ ( శంకరా, శివా) నీకు సదా(అనిశం)  నమస్కారములు అవి ఎటువంటివి అంటే నా మనస్సుతోను, నా శిరస్సుతోను  , నా శరీరంతోను నీకు  సాష్టాంగ నమస్కారములు ( మహన్యాసములో చెప్పినట్టు) . 

నిత్యానందములో వుండే నీవు (మోదకర) వేదములలో ఉత్తమమైన సామవేదము యొక్క మూలమూ, అర్థము నీవుఎందుకు అనగా యజుర్వేదములో 3 స్వరములే వున్నాయి కాని సామవేదం సంగీతానికి మూలం ఈ వేదంలో అన్ని స్వరములు వున్నాయి. అట్టి నీకు మరల మరల నమస్కారములు. 

నాదోపాసనకు మూలము , నాదమును ఆనందించే వాడివి , నాదస్వరూపుడవు (స రి గ మ ప ద ని స )  అయి , కాలస్వరుపుడైన యముని భాదను తోలగించువాడవు, ఇంకొక ఆర్థం సంగీతంలోని వివిధ కాలములలో(  సాధారణ, మధ్యమ, పై స్థాయి, మంద్ర) ( పాటను మొదటి, రెండవ, మూడు కాలములలో )  వున్నవాడవు, (విదళిత కాలం)సప్త స్వరములు నీ ఐదు ముఖములైన సద్యొజాత, అఘోర, వామదేవ, ఈశాన,తత్పురుష, (ఊర్ద్వ, అధోముఖ) లనుండి పుట్టాయి అట్టి నాదస్వరూపుడైన నీకు నమస్కారం. 

 శివుడే నాదస్వరూపుడు  ఆయన నుండే శబ్దము , అందునుండి ప్రణవము  ఇలా ఉద్బవించాయి.

తవ దాసోహం దాశరథే

తవ దాసోహం తవ దాసోహం

తవ దాసోహం దాశరథే


వర మృదు భాష విరహిత దోష

నర వర వేష దాశరథే…తవ దాసోహం


సరసిజ నేత్ర పరమ పవిత్ర

సుర పతి మిత్ర దాశరథే…తవ దాసోహం


నిన్ను కోరితిరా నిరుపమ శూర

నన్నేలుకోరా దాశరథే…తవ దాసోహం


మనవిని వినుమా మరవ సమయమా

ఇన కుల ధనమా దాశరథే… తవ దాసోహం


ఘన సమ నీల ముని జన పాల

కనక దుకూల దాశరథే… తవ దాసోహం


ధర నీవంటి దైవము లేదంటి

శరణనుకొంటి దాశరథే… తవ దాసోహం


ఆగమ వినుత రాగ విరహిత

త్యాగరాజ నుత దాశరథే…తవ దాసోహం


ధశరథ రాజ కుమార!  త్యాగరాజచేత పొగడబడే వాడవు అయిన రామ నీకు నెను దాసుడను. నీవు సకల  ఆగమములచే తేలియబడేవాడవు, భందములు లేని వాడవు,.ఈ భూమిపై నీ వంటి దైవము ఇంకొకరు లేరు, నిన్నే శరణు అంటున్నాను. 
పీతాంబర ధారి, నీలమెఘచ్ఛాయ  శరీరము కలిగిన వాడవు,.ముని జనులను పాలించు వాడవు, నా మనివిని విను స్వామి, నను మరువుటకు ఇది సమయముకాదు, రవి వంశమునకు ధనము, పెన్నిది లాంటివాడవు. 
ఓ రామ నిన్నే కోరుకొన్నాను, నీవంటి శూరుడు ఇలలో లేడు నన్ను ఎలుకోరా ఓ స్వామి, పద్మమువంటి కన్నులు కలవాడవు, పరమ పవిత్రమైనవాడవు, దేవేంద్రునికి మిత్రుడవు రామ నీకు దాసోహం.
పెద్దలను , పిల్లలను ముందుగా పలకరించేవాడవు, ఎటువంటి దోషములు లేనివాడవు, ఈ భువిపై నరుడిగా జన్మించి  మానవులకు ఎలా నడుచుకొవాలో అని చూపినవాడవు నీకు దాసోహం.

అంబ నిను నమ్మితినంటే

అంబ నిను నమ్మితినంటే

నీకనుమానమేమమ్మ


శంబర వైరి జనక సోదరి

శరణు జొచ్చి మనసార శ్రీ జగదంబ నిను


గీర్వాణ గణాధారి అంబశర్వాణి అఖండాకారి పర్వత రాజ మనోజ్ఞ కుమారి

నిర్వాహము లేక మదిని కోరి…అంబ నిను


సుర వైరి కదన శౌర్యేవరుణాలయ సమ గాంభీర్యే స్వర జిత కోకిల రవ మాధుర్యే

పరితాపము తాళకను సు-చర్యే… అంబ నిను


శర్మ దాయకి గౌరి దుష్కర్మ కలుష వన కుఠారి నిర్మల త్యాగరాజ హృచ్చారి ధర్మ సంవర్ధని ఓంకారి…అంబ నిను


ఓ నిర్మలుడైన త్యాగరాజ స్వామి (శివుడు అని ఇంకొక అర్థం)హృదయంలో సదా చరిస్తున్నటువంటి( మంత్ర రూపకం, మనో రూపకం) ధర్మ సంవర్ధని , ఓంకారానికి మూలమైన ఆకారము కలదానవు, ఆనందములు ఓసగి, దుష్కర్మలు అనే వనమును తొలగించు గొడ్డలివంటి(కుఠారి) దానవు, ఓ గౌరి నేను నన్ను శరణు వేడాను, సంపూర్ణ శరణాగతి అయివున్నాను అంటే ఏల నమ్మవు, ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు. ఓ జగదంబా , నన్ను అనుమానించకు. 
శంబరాసుర వైరి అయిన కామదేవుని తండ్రి అయిన నారాయణుని చెల్లెలా ఓ నారాయణి, నా మనసార నీ శరణు అంటున్నాను. 
దేవతల గణములకు నాయకివి, శర్వుని ఇల్లాలివి, పర్వతరాజుకి ముద్దుల కూతురివి, ఇక నా లౌకిక , ఆధ్యాత్మిక జీవనాన్ని నడపలెకుండా , నా మదిని నీ శరణుజొచ్చాను. 
 దేవతలు , దానవుల  యుద్ధ రంగములో నీ శౌర్యము తిరుగులేనిది, నీ గాంభీర్యము సముద్రము వంటిది, నీ స్వరము కొకిల దేవతలను మించినది,.ఇక పరితాపము ,విరహము తాళలేకపొతున్నాను ఓ మంచి పనులు చేయించు అంబా.  నీ శరణు .

అమ్మ ధర్మ సంవర్ధని యాదుకోవమ్మ

అమ్మ ధర్మ సంవర్ధని-

యాదుకోవమ్మ మాయమ్మ ధర్మ సంవర్ధని


ఇమ్మహిని నీ సరియెవరమ్మ

శివుని కొమ్మ మాయమ్మ  ధర్మ సంవర్ధని


ధాత్రి ధర నాయక ప్రియపుత్రి మదన కోటి మంజుళ గాత్రి అరుణ నీరజ దళ నేత్రి నిరుపమ శుభగాత్రి పీఠ నిలయే వర హస్త

ధృత వలయే పరమ పవిత్రి భక్త పాలన ధురంధరి వీర శక్తి నే నమ్మినానమ్మ ధర్మ సంవర్ధని


అంబ కంబు కంఠి చారు కదంబ గహన సంచారిణి బింబాధర తటిత్కోటి నిభాభరి దయా వారి నిధే శంబరారి వైరి హృచ్చంకరి

కౌమారి స్వర జిత తుంబురు నారద సంగీత మాధుర్యే , దురిత హారిణి మాయమ్మ ధర్మ సంవర్ధని


ధన్యే త్ర్యంబకే మూర్ధన్యే పరమ యోగి హృదయ మాన్యే త్యాగరాజ కుల

శరణ్యే పతిత పావని కారుణ్య సాగరి సదా

అపరోక్షము కారాదా సహ్య కన్యా తీర వాసిని పరాత్పరి కాత్యాయని రామ సోదరి మాయమ్మ ధర్మ సంవర్ధని..

ఓ త్యాగరాజ కులము చేత పూజింపబడుచున్న , (కులదైవమైనటువంటి,) సహ్యాద్రి(పశ్చిమ కనుమలు)  పర్వతాలలో పుట్టినటువంటి  కావేరి నదీ తీరములోని  తిరువయ్యూరు లో  నివసించు ఓ పరాత్పరి , కాత్యాయని(కాత్యాయన మహర్షి తపోఫలముగా కూతురుగా జన్మించిన) , రాముని చెల్లెలైన( నారాయణ సహోదరి – నారాయణి)  ఓ ధర్మసంవర్ధని, మా అమ్మ నీవు – పతితులు నీ శరణు అన్న వారిని పావనులను – పవిత్రులను చేసే దాన, కరుణా సముద్రమా – సముద్రమువంటి అపారమైన కరుణకలదాన , ధన్యురాల, మూడుకన్నులు కలదాన ( త్ర్యంబకుడైన శివుని ఇల్లాల) ,సకల దేవతలందరిలోను మకుటాయమైనదాన(మూర్దన్యే), మహా యోగుల హృదయాలలో సదా వసిస్తు వారిచే పూజింప బడుచున్న మహిమాన్వితురాల అమ్మా,  సదా – ఎల్లప్పుడు నాకు నీయోక్క అనుభూతిని( అపరోక్షము)  ప్రసాదించు. 
ఓ అమ్మా ఆదుకో,  కాపాడు, ఈ భూమిపై నీవు తప్ప అన్యులు ఎవరున్నారు, నీకు సమానమైన దైవము ఎవరు, శివుని ఇల్లాలివి మా అమ్మా. 
ఓ భూమాత (ధాత్రి) , హిమవంతుని ముద్దుల  పుత్రి( ధరనాయక పుత్రి) ,(ధాత్రీ ధరనాయకుడు -వరాహ రూపుడైన హరి ఆయన ప్రియమైన పుత్రి(చెల్లెలు)), కోటిమంది మన్మథులకూడ సిగ్గు పడే అతి లావణ్యమైన అంగములు కలదాన‌,నీరెండ రంగు అయిన ఎఱుపు రంగు పద్మములవంటి కన్నులు కలదాన ,  మంచి కంఠము కలదాన, శక్తి పీఠములలో(అమ్మవారి శరీర భాగములు పడిన 50 ప్రదేశాలు) నివసించే నీ వరములు ఇచ్చే చేతులకు అందమైన గాజులు,కంకణములను ధరించిన పరమ పావని , నిను నమ్మిన భక్తుల పాలించడంలో నీకు సరి ఏవ్వరు లేరు(ధురంధరి) , వీరశక్తి – భద్రకాళివి,(శివుడు వీర మార్గంంలో భైరవుడు , అమ్మ భైరవి)  లేదా శ్రీవిద్యలోని కౌలమార్గంలో శక్తిని వీరశక్తి అంటారు ( శుద్ద మార్గం, వీరమార్గం) , అటువంటి నిను నేను నమ్మినాను కాపాడు. 
ఓ అంబా ,  శంఖము వంటి మెడ కలిగిన (మెడపై శంఖమునకు వున్నట్టు ‌3 రేఖలు వుండడము శుభ సాముద్రికము) (కంబుకంఠి) ,  అత్యంత రహస్యమైన కదంబ వనంలో   తిరిగే అందమైన అమ్మా (కదంబ గహన సంచారిణి –   శరీరంలో ని  రహస్య షట్చక్ర సాధనము  అనే కదంబ వనంలో కుండలినీ శక్తి గా సంచారము చేయు మెరుపు తీగ)  దొండపండు వంటి పెదవులు కలిగి , ఆకాశంలో ఓక్క సారిగి కోటి  మెరుపుల వంటి  అందమైన శరీరము కలదాన, దయా సముద్రురాలవు, మన్మథుని శత్రువైన ( శంబరారి – మన్మథుడు మరలా  కామదేవుడిగా పుట్టి శంబరాసుర సంహారం చేస్తాడు అతని శత్రువు,. ప్రధ్యుమ్నుడుగా పుట్టిన చిత్రలేఖను పేళ్ళి చేసుకొంటాడు – భాగవతం)  శంకరుని హృదయములో సదా వెలసిన శంకరి, కౌమారి ( ఆష్టశక్తులలో ఓకరు – బ్రాహ్మీ, వైష్ణవి, వారాహి,కౌమారి,ఇంద్రాణి, నారసింహి, చాముండి, మాహేశ్వరి) , నీ స్వరము తుంబుర ,నారద , సరస్వతుల గానం కన్నా, వారు వాయించే వీణా ధ్వనులకన్న మేలైనది , హాయిని కలిగించునది, అత్యంత మాధుర్యము కలది, ఓ అమ్మా మా దురితములను పాపములను పొగొట్టే ధర్మసంవర్ధని పాలించు.

దేవ శ్రీ తపస్తీర్థ పుర నివాస

దేవ శ్రీ తపస్తీర్థ పుర నివాస

దేహి భక్తిమధునా


పావన ప్రవృద్ధ శ్రీమతి

హృద్భవన సకల జగదవన శ్రీ మహా దేవ శ్రీ తపస్తీర్థ


పాశ హస్త గణేశ హరణ

పలాశనారి నుతేశ వరద

కుశేశయారి ధరాశరేభ

మృగేశ సప్త ఋషీశ దేవ… 

దేవ శ్రీ తపస్తీర్థ


నీల గళ సుర జాల నుత నత

పాల గిరీశ విశాల ఫాల

కృపాలవాల సు-శీల గౌరీ

లోల శివ మాం పాలయాద్భుత.. దేవ శ్రీ తపస్తీర్థ


నాగ పూజిత నాగ దనుజ

హరాగ మర్దన వాగధిప

వినుతాగణిత గుణ రాగ మద

దూరాఘ హర శ్రీ త్యాగరాజ… దేవ శ్రీ తపస్తీర్థ

శ్రీ త్యాగరాజుని పాలించే శ్రీ తపస్తీర్థేశ్వరుడా !నాకు నీ యందు అమృతం వంటి అనగా ఎప్పటికి నశించని భక్తి ని ప్రసాదించు. 
నాలో మంచి గుణములను పెంచే మహాదేవా, ఈ సకల జగత్తును పరిపాలించే వాడివి నీవు నీ ఇల్లలైన శ్రీమతి అనే పేరుతో వెలసిన పార్వతీ దేవి హృదయములో సదా వసించువాడవు. 
గణనాయకుడు , పాశమును ధరించు వాడైన యముని భాదను తోలగించు వాడవు. దేవేంద్రుని(పలా – మాంసము,ఆశన-తినువారు ,రాక్షసులు- అరి- శత్రువు) చే పొగడబడి, దేవతలను రక్షించే , చంద్ర ధరా(కుశేశయ- పద్మము ,.అరి – శత్రువు) గజాసురుడు మొదలగు ఏనుగులవంటి శత్రువుల పాలిట సింహము వంటి వాడవు,సప్త ఋషులచే కొనియాడబడే స్వామి నీ యందు ధృడభక్తిని ప్రసాదించు. 
ఓ  గరళము త్రాగుటచే నీలముగా మారిన కంఠము కలవాడ, గిరులకు పతియైనటువంటివాడ, విశాలమైన నుదురు కలవాడ ( మూడవకన్ను వుంటుంది) , దేవతల బృందము చే పొగడబడే ,  సుశీలయైన గౌరీ దేవి ప్రేమలోల, కృపా సముద్రుడా, నిను శరణన్న వారిని రక్షించే శివా  , అద్బతమైన శ్రీ తపస్తీర్థేశ్వరా నీయందు భక్తిని ప్రసాదించు. 
శేషుని(నాగ)చే పూజలందే, గజాసుర సంహార(నాగదనుజహరా), దేవేంద్రుడు-(అగము- పర్వతము (మేరు పర్వతానికి,వింధ్య పర్వతానికి జరిగిన పోటి), అగమర్ధన – కృష్ణడు (గోవర్దన పర్వతాన్ని ఎత్తినవాడు) ,బ్రహ్మ శిరము తుంచి గర్వము అణచి వీరిచే పూజింపబడే  శివా, లేక్కవేయలేనన్ని మంచి గణములు కలవాడ, నాలోని రాగము ( పాశము, ఇష్టము), మదము(అహంకారము) దుష్టములైన పాపములను నశింపచేసి నీ యందు  భక్తిని ప్రసాదించు స్వామి.

శంభో మహా దేవ శంకర గిరిజా రమణ

శంభో మహా దేవ శంకర గిరిజా రమణ


శంభో మహా దేవ శరణాగత జన రక్షక

అంభో-రుహ లోచన పదాంబుజ భక్తిం దేహి…శంభో మహా దేవ


పరమ దయా-కర మృగ ధర హర గంగా ధర ధరణీ

ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివేశ

సుర బృంద కిరీట మణి వర నీరాజిత పద

గోపుర వాస సుందరేశ గిరీశ పరాత్పర భవ హర …శంభో మహా దేవ


ఓ త్యాగరాజుని హృదయ మందిరములో నివసించే  కోవురు (గోపుర) లో వెలసిన  సుందరేశ్వరుడు అనే పేరుతో వెలసిన పరాత్పర , గిరీశ, ఈ భవములను -సంసార కష్టములను తోలగించే హరా, పరమ దయాకర,  జింకను(మృగ) చేతియందు ధరించిన, గంగాధర, ఆదిశేషుని( ధరణీ ధర భూషణ)  ఆభరణముగా కలిగినవాడ , నీ పదములు దేవతా బృందముల  కిరీటములలోని మణులవల్ల వెలుగుతు వారిచే నీరాజనము చేస్తున్నట్టుగా వుంది. ఓ శంభో మహాదేవ. 
ఓ మహిదేవ  నీవు నిను శరణు అన్న వారిని రక్షించే వాడివి , పంకజములవంటి కన్నులు కలిగిన నీ పాదపద్మముల యందు  స్థిర భక్తిని ప్రసాదించు శుభములు( శంకర) ఒసగే గిరిజా – (పర్వత రాజ పుత్రి) పార్వతి రమణా .