మనసు నిల్ప శక్తి లేక పోతే
మధుర ఘంట విరుల పూజేమి జేయును
ఘన దుర్మదుడై తా మునిగితే
కావేరి మందాకినియెటు బ్రోచును…మనసు నిల్ప
సోమిదమ్మ సొగసు-గాండ్ర కోరితే
సోమ యాజి స్వర్గార్హుడౌనో
కామ క్రోధుడు తపంబొనర్చితే
కాచి రక్షించునో త్యాగరాజ నుత…మనసు నిల్ప
ఓత్యాగరాజ సన్నుత శ్రీరామ! నీ యందు మనసు నిల్పలేకపోతే ఏమీ చేసినప్పటికి ఏమి ప్రయోజనము.
మనసు నిల్పడం అంటే మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్దిగా ఆయన పాదలపై మన మనస్సును నిలపటం. అన్య ఆలోచనలు లేకుండా సదా ఆయన ధ్యాసలో నిలపగలగడం సాధకుడైన వాడు చేయవలసింది.
అలా కాకుండా ఇతర ఆలోచనలతో మంచి ధ్వని చేసే గంట తోను,సువాసనలు వెదచెల్లు వివిధ పుష్పములతోను ఏంత ఘనముగా పూజించినప్పటికి అది ప్రయోజనం ఇవ్వదు.
మహా ధూర్తడై , అనేక పాప కర్మలు చేస్తు పుణ్య నదులైన గంగా,కావేరి ఇతర నదులలో మునిగితే ఏమి ప్రయోజనం లేదు. పుణ్యకర్మలు చేస్తూ నదులలో స్నాన కర్మలవల్ల ప్రయోజనం.
యాగాలలో ఉత్కృష్టమైన సొమయాగం చేసిన దంపతులను సోమయాజి , సోమిదమ్మ అంటారు. అటువంటి మహా ఇల్లాలు పతివ్రత పరపురూషులను కోరితే భర్తకు పుణ్యలోకం ఎలా కలుగుతుంది. ఇక్కడ భార్య,భర్త త్రికరణ శుద్దిగా ఒకే ఆలోచన,క్రియ,మాట అనేలా అన్యోన్యంగా ఆదర్శప్రాయంగా వుండాలి అన్నది ఇక్కడి ఉద్దేశ్యం.
అరిషడ్వర్గములలో ముఖ్యమైన కామ , క్రోధములకు ఇతర కోరికలకు లోనైనవాడు వాటికి దాసుడైన వాడు ఎంత కఠిన తపస్సు చేసిన ఏమి ప్రయోజనం వుండదు అటువంటి వారిని ఎవ్వరు కాపాడి రక్షించరు.